జగన్ తీగ, కాంగ్రెస్ డొంక
జగన్
అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ తాజాగా ఛార్జ్ షీట్ లో
హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును జతచెయ్యటంతో ఆమె తీవ్ర ఆవేదనకు
గురయ్యారు. కానీ నిన్న సిబిఐ కేవలం సమన్లు ఇస్తాం కానీ అరెస్ట్ చెయ్యమని చెప్పేటప్పటికి ఆమెతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులకూ ఊరట కలిగింది.
జగన్
మాత్రమే అవినీతి పరుడు, ఆయన తండ్రి వైయస్ ఆర్ కూడా కాదు అంటూ మొదట్లో
చెప్పిన కాంగ్రెస్, వైయస్ ఆర్ ఫొటోను కూడా ఎన్నికలలో వాడుకుంది. కానీ ఆ తర్వాత వైయస్ ఆర్ విషయంలో దూరంగా ఉంది. అయితే
జగన్ తీగ లాగితే కాంగ్రెస్ డొంకంతా కదిలినట్టు కాంగ్రెస్ నాయకుల పేర్లన్నీ
సిబిఐ ఛార్జి షీట్లలోకి ఎక్కుతుంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి
నెలకొంది. కాంగ్రెస్ కి
అవినీతంటే ఏమిటో తెలియదు, అంతా జగన్మాయే అంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన
మాటలను ఎలా సమర్థించుకోవాలో తెలియకుండా తయారైంది. ఇప్పుడామె
రాజీనామా చేస్తే ఇప్పటికే ఒక మంత్రి జైల్లో ఉండటం, మరో మంత్రి అవినీతి
కుంభకోణంలో రాజీనామా చెయ్యటం వలన ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం
పోతుందని ఢిల్లీ హై కమాండ్ కూడా భావించి తదనుగుణంగా ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డికి సూచనలిచ్చినట్టుగా తెలుస్తోంది.
తన మీద సెక్షన్ 420, 409 కింద అభియోగాన్ని మోపటం పోలీస్ శాఖకు నాయకురాలిగా పనిచేస్తున్న ఆమెకు వేదన కలిగించిందని సబిత చెప్పారు. కానీ ఆమెను పరామర్శించటానికి వచ్చిన వాళ్ళతో ధైర్యంగా మాట్లాడిన సబిత, ఇంద్రారెడ్డి లేకపోవటంకంటే ఎక్కువ కష్టమైతే కాదు అని అన్నారు. రాజకీయాల్లో
ప్రతి అంశాన్ని రాజకీయ దృష్టి కోణంలోనే చూడాలి కాబట్టి, సబితా
ఇంద్రారెడ్డిని రాజీనామా చెయ్యవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ నచ్చచెప్పారు. అంతే కాదు సిబిఐ
దర్యాప్తులో బయటకు వచ్చే అవకాశమున్న మిగిలిన నాయకుల గుండెల్లో గుబులు మొదలై
ఈ విషయాన్ని అధిష్టానానికి విన్నవించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరినట్టుగా
కూడా తెలుస్తోంది. వయసు
మళ్ళినవాళ్ళు, వాళ్ళ సమకాలీనులు చనిపోయినప్పుడల్లా మానసికంగా వీళ్ళూ
కృంగిపోతారు తమవంతు ఎప్పుడు వస్తుందో అన్న వేదన మొదలవుతుంది. అలాగే ఒక మంత్రి ఇరుక్కునేటప్పటికి మిగతావాళ్ళకి కూడా మనసులో ఆందోళనరావటం సహజం.
తనే
తప్పూ చెయ్యలేదని, రొటీన్ లో పెట్టిన సంతకాలే కానీ కావాలని అవినీతికి
పాల్పడలేదని, చట్టం మీద తనకు అపారమైన గౌరవం ఉందని, తను న్యాయబద్ధంగానే
పోరాడతానని, దర్యాప్తులో సిబిఐకి సహకరిస్తానని సబిత అన్నారు. అయితే రాజీనామా నుంచి ఆమెను తప్పించినా, ఆమె మంత్రిత్వ శాఖను కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఏది ఏమైనా సోనియాగాంధీ విదేశ పర్యటన ముగించుకుని వచ్చేంతవరకూ ఎటువంటి మార్పులూ చెయ్యటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు.

No comments:
Post a Comment