బంగారమంతా
తనకే కావాలనే దురాశతో ఒక రాజు తపస్సుచేసి దేవుడిని ప్రసన్నంచేసుకుని తను
ముట్టుకున్నదంతా బంగారం కావాలని వరాన్ని అడిగి తీసుకున్నాడట. ఇంకేముంది
అతను ముట్టుకున్నదంతా బంగారంగా మారిపోయి ధనవంతుడయ్యాడు. కానీ తినటానికి
తిండి లేకుండా అయిపోయింది. తినటానికి ముట్టుకున్నా అదీ బంగారమైతే ఇక
తినేదేముంటుంది. ఇంకా జరిగిన ఘోరం, కలిగిన మనస్తాపమేమిటంటే, బంగారంలా
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని పుత్రికా వాత్సల్యంతో దగ్గరకు
తీసుకోగానే ఆమె బంగారపు బొమ్మైపోయింది. వైయస్ కూడా ఎక్కడా గనులూ భూములు
లేకుండా తన సొంతం చేసుకోవటానికి దోచేసుకున్నాడు, అతని కొడుకు
జైలుపాలయ్యాడని తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న తెలుగు దేశం
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పిట్టకథను దివంగత ముఖ్యమంత్రి వైయస్,
అతని కుమారుడు జగన్ లకు అన్వయించి చెప్పారు.
జగన్
కి లక్ష కోట్ల రూపాయలు దోచిపెట్టబట్టే రాష్ట్రంలో విద్యుత్ కొరత
ఏర్పడిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అదే తోవలో పోతున్న కిరణ్ కుమార్
ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ లను తన బంధు వర్గానికి ఇచ్చి, నాసిరకంతో పనులతో
సరఫరా చేసిన నాసిరకం పరికరాలతో జెన్ కో ని నిర్వీర్యం చేసి వదిలిపెట్టారని
ఆయన అన్నారు. విద్యుత్ లేమితో ఆంధ్రప్రదేశంతా అంధకారంలో మగ్గిపోతున్నదని,
అందుకు పరిష్కారం చూపించాల్సింది పోయి జనం మీద మరింత భారం మోపుతున్నారని,
ఇది చాలా అన్యాయమని ఆయన వాపోయారు. తన హయాంలో 25 పైసల నుంచి 30 పైసలకు
పెంచినప్పుడు రాద్ధాంతం చేసినవాళ్ళు ఇప్పుడు ఏకంగా 40 వేల కోట్ల రూపాయల
భారాన్ని జనం మీద పెడదామని చూస్తున్నారని, ఎన్నికల సమయంలో విద్యుత్
ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి పదవిలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో
మూడు సార్లు పెంచారని చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
No comments:
Post a Comment