
కుల వ్యవస్థకు ఎక్కడ లేకున్నా రాజకీయాలలో మాత్రం పెద్ద స్ధానం ఉందన్న విషయం నిర్వివాదం.
కులాల
పేర్లు చెప్పుకోవటం సభ్యతగా భావించని రోజులు వచ్చినా, రాజకీయాలలో కులాల
పేర్లను ఎటువంటి సంశయమూ లేకుండా విరివిగా వాడుతుంటారు. అలా మాటల్లో వాడటమే
కాదు రాజకీయ లబ్ధికోసం ఏ వర్గం వారికి వలవెయ్యాలా అని చూడటం కూడా కద్దు.
వోటుబ్యాంక్ కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలు, ఎస్ సి, ఎస్ టి, కాపుల మీద
దృష్టి సారిస్తుంటే, ప్రస్తుతం వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్
రాజకీయంగా వేస్తున్న అడుగులు చూస్తుంటే కాపు వర్గం మీద కన్నువేసి అధికారంలోకి వద్దామని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ విషయానికొస్తే, ముస్లింలు, ఎస్ సి ఎస్ టి లను కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాపు వర్గం మీదనే దృష్టి సారిస్తోంది. సీమాంధ్రలో చూసుకుంటే 32 శాతం కాపు ఓటర్లున్నా, అందులో కొందరు ప్రజారాజ్యం పార్టీ ద్వారా కాంగ్రెస్ వైపు ఆకర్షితులై ఆ పార్టీకి మద్దతునిస్తున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న కాపు వర్గంవారు ఇప్పుడు సమీకరించుకునే యత్నంలో ఉన్నారు. సీమాంధ్రలోని కాపులు తెలుగు దేశం పార్టీలో కలవకుండా ఉండటం కోసం జిఓ 30 ని పునరుద్ధరించి కాపులను బిసిలలో కలుపుతామని మాటిస్తూ కాంగ్రెస్ ముందుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఆ ఆలోచనను కల్పించిన వారు కూడా కాపు వర్గ పెద్దలైన చిరంజీవి, సి.రామచంద్రయ్యలే. కాపులను విస్మరించారని, వారి సంక్షేమంలో ఏమైనా చెయ్యకపోతే పార్టీకి మనుగడ ఉండదని లోగడ వాళ్ళు సోనియా గాంధీకి చెప్తూ వచ్చారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న నాయకులెవరు? సుబ్బారాయుడు, బాల, ఉమారెడ్డి, అంబటి రాంబాబు గుంటూరు మీద దృష్టి సారిస్తున్నారు. కాపు వర్గీయులను కలుపుకోవటం ద్వారా గుంటూరులో రాజకీయంగా శక్తివంతమవటానికి పావులు కదుపుతోంది ఆ పార్టీ. కాపులు కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా లేరని, తెలుగు దేశం పార్టీయేమో వాళ్ళ మీద దృష్టి పెట్టలేదని అందువలన కాపులను కలుపుకునే పని చేపట్టాలని జగన్ తన పార్టీ నాయకులకు చెప్పారు. తెలుగు దేశం పార్టీని చూసుకుంటే గుంటూరు జిల్లాలో కాపు వర్గ మద్దతు లేదు. అందువలన జగన్ గుంటూరులో అయోధ్య రామిరెడ్డి, బాల తెదేపాను వెనక్కి నెట్టేసే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజన కాకముందు, కొన్ని సీట్లు ఇక్కడ అక్కడా పోగొట్టుకున్నా తెలంగాణా ప్రాంతం కాపుకాసేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. సీమాంధ్రలో 32 శాతం ఉన్న కాపు వర్గం పెద్ద వోటు బ్యాంక్ గా ఆవిర్భవించింది. వీరి వలన గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలలో ఈ వోటు బ్యాంక్ ప్రభావం బాగా ఉంటుంది. శక్తి లేని వారి మద్దతు ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి, కాపు మద్దతు లేకుంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది.

ఉదాహరణకు చిలకలూరిపేటలో ముస్లింలు, కాపులు, రెడ్లు, ఎస్ సి లు వైయస్ ఆర్ కాంగ్రెస్ వైపు వస్తే తెదేపాను ఆ పార్టీ తప్పక ఓడిస్తుంది. అలాగే మిగతా ప్రాంతాలలో- పెదకూరపాడు, పొన్నూరు లలో కూడా కాపు వర్గీయులు వోటు వేస్తేనే తెదేపాకు గెలిచే అవకాశం ఉంది.
అలాగే, గుంటూరులో శక్తివంతమైన గల్లా జయదేవ్ తెదేపాలో చేరినా, వైయస్ ఆర్ కాంగ్రెస్ బాల ను నిలబెట్టటం వలన జయదేవ్ కోసం మహేష్ బాబు వచ్చి ప్రచారం చేసినా సరే ఓడటం ఖాయం. కాబట్టి ఇప్పటికైనా తెదేపా కళ్ళు తెరచి కాపు వర్గీయుల సంక్షేమంలో ఏమైనా ప్రణాళిక వేసినట్లయితే కొంతైనా వోటు బ్యాంక్ పటిష్టమౌతుంది.
అదేవిధంగా సత్తెనపల్లిలో చూసుకుంటే అంబటి రాంబాబు వైయస్ ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నప్పుడు తెలుగు దేశం పార్టీ తనకు మొదటి నుంచి మద్దతుగా నిలిచి వస్తున్న వోటరు వర్గాలను కాకుండా కొత్త కొత్త వర్గాలను ఆకర్షిస్తే తప్ప గెలుపు కష్టమౌతుంది. తెదేపాకి ముస్లిం, ఎస్ సి, కాపు వర్గాల మద్దతు లేకపోవటం వ్యూహాత్మక దృష్టిలో చూస్తే లోపమే అవుతుంది.
ఇలా ఇతర నియోజకవర్గాలలో కూడా పరిశీలిస్తే, జగన్ ఎంతో వ్యూహాత్మకంగా కాపు వర్గీయుల మద్దతును, అభిమానాన్నికూడగడుతున్నారు కాబట్టి సీమాంధ్రకు ముక్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం మెండుగా కనపడుతోంది.

చంద్రబాబు నాయుడు దూరాలోచనతో ఎక్కువ స్థానాలలో పట్టు ఉన్న యువనాయకుడిని ఎవరినైనా పార్టీలోకి తీసుకుంటే ఎక్కువ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా తెలుగు దేశం పార్టీ కొత్త ఆలోచనలకు తెరతీస్తూ, ప్రస్తుతం నెలకొనివున్న రాజకీయ పరిస్థితిని సరైన దృక్కోణంలో బేరీజు వేసుకుని ముందుకెళ్తేనే గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికైనా తన ఎన్నికల ప్రచారంలో కాపు వర్గీయులను ఆకర్షించినట్లయితే తెలుగు దేశం పార్టీ గుంటూరు జిల్లాలో శక్తివంతమైన పార్టీగా నిలుస్తుంది. ఈ సూత్రాన్ని కనుగొన్న వైయస్ జగన్ గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసివున్నారు.
సీమాంధ్రలో ప్రస్తుతం పోటాపోటీగా ఎన్నికల బరిలో నిలిచివున్నవి ఈ రెండు పార్టీలే కాబట్టి ఎవరు ఎక్కువగా కాపు వర్గీయులను కలుపుకుంటారో వాళ్ళే గెలుపుగుర్రాలుగా నిలుస్తారు. ఆ వర్గ సంక్షేమం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే గద్దె ఎక్కే అవకాశం ఉంది.
అంటే, ఆ వర్గం నిజంగానే ఎన్నికలలో ఏ పార్టీకైనా కాపుకాయగల సామర్ధ్యాన్ని కలిగివుంది!
అయితే ఒక ప్రమాదం కూడా ఉంది!

కేవలం పైకి మాటల్లో మాత్రమే వాగ్దానాలు, వరాలు గుప్పిస్తే సరిపోదు నిజంగానే ఆ వర్గం వారి సంక్షేమం కోసం పనిచేయాలి. వారి విషయంలో మోసం చేసినా లేక వారికి దక్కవలసిన హామీలు దక్కకపోయినా వాళ్ళు పార్టీని వీడే పరిస్థితి ఉండటమే కాకుండా సొంతంగా వేరే పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీ అంతకు విఫలమైనా చేసిన తప్పులను తెలుసుకుని పుంజుకునే అవకాశం ఉంది.
ఈ వర్గం వారు అధిక సంఖ్యాకులే అయినా ఎక్కువ మంది ధనికులు లేకపోవటంతో వ్యాపారంలో దిట్టలు ఎక్కువగా లేకపోవటంతో ఎవరైనా ఏ కులస్తులైనా మెరికలాంటి యువకులు వీరి మద్దుతుని తీసుకోగలిగితే అధికారం చేపట్టగలుగుతారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న శేషాంధ్రప్రదేశ్ లో ఏ పార్టీయైనా నెగ్గుకురావాలీ అంటే సమిష్టిగా కాపు వర్గమని పిలవబడే తెలగ, బలిజ, కాపు, ఒంటరిలను కలుపుకుపోవాల్సిందే.

చూద్దాం, ఈ దిశగా జగన్, చంద్రబాబు లేక కొత్తగా ఎన్నికల బరిలోకి వచ్చిన కిరణ్ లలో ఎవరు ముందుగా పావులను కదుపుతారో, అందుకు ఫలితంగా ఎవరు లబ్ధిపొందుతారో! ఇక పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ విషయానికొస్తే, లోగడ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతునివ్వటం వలన కలిగిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆ వర్గనేతలు అనుకుంటున్నట్లుగా సమాచారం.
-శ్రీజ
Jagan strategy for strong hold on Seemandhra, Kapu community strong hold, YS Jagan for Kapus suuport, Chandra Babu Naidu, Kiran Kumar Reddy political party
No comments:
Post a Comment