Thursday, 6 February 2014

Why Superstitions Continue



superstitions.png

చదువు చదువే, ఆచారాలు ఆచారాలే అని ఇప్పటికీ నిరూపిస్తున్నారు 2011 గణాంకాల ప్రకారం 88.62 శాతం అక్షరాస్యత, ఐటి లో అగ్రస్థానంలో ఉన్న దక్షిణ కర్నాటక రాష్ట్రంలో.   సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన బ్రాహ్మణులు తిని వదిలేసిన ఆహారాన్ని సేవించటం, వారి ఎంగిలి మీద పొర్లుదండాలు పెట్టటం ఇప్పటికీ జరుగుతుండటం హేతుబద్ధంగా ఆలోచించేవారికి జుగుప్స కలిగిస్తుంది కానీ శతాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని నిషేధించి అరికట్టే ప్రయాసలో అధికారులు విఫలమౌతున్నారు.

పుస్తకాలకు పూజ చేసే ఆచారాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ కంప్యూటర్ కి కుంకుతో పూజలు చేసే వాళ్ళు, ప్రకృతి సిద్ధమైన అలంకరణలైన పువ్వులతో మోటారు వాహనాలను అలంకరించేవారున్నారు.  కొత్తగా కొన్న వాహనాన్ని నిమ్మకాయల మీద నడిపించటం ద్వారా గుమ్మడి కాయను దాని ముందు బద్దలు కొట్టటం ద్వారా బలి ఇచ్చినవారున్నారు.  వాహనం బలికోరుతుందని, అందువలన ఇటువంటి బలులు ప్రమాదాలు దుర్ఘటనల నుండి రక్షిస్తుందని వారి నమ్మకం.  పెద్ద పెద్ద ప్రాజెక్టుల దగ్గర నరబలులు ఇచ్చిన సంఘటనలు కూడా కొన్ని ఆలస్యంగా వెలుగుచూసాయి.

ఈ నమ్మకాలను మనం మూఢ నమ్మకాలు అనటానికి కారణం, వాటి వలన ఒనగూడే లాభమేమిటో తెలియకపోయినా శాస్త్రీయ దృక్పథంతో చూస్తే అర్థం లేనిదనిపించినా ఆచారాలను కొట్టిపారెయ్యకుండా మూఢంగా- అంటే వివేకాన్ని ఉపయోగించకుండా యాంత్రికంగా చేసుకుంటూ పోవటమే.  పనిమీద పోతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే ఆగిపోవటం లాంటి పనులు ఇంకా చాలామంది పాటిస్తున్నారు.

ఒకపక్క జరిగేది జరగక మానదు, మనకెంత రాసిపెట్టుందో అంత జరిగి తీరుతుంది అని నమ్మేవారు కూడా మూఢాచారాలు వాళ్ళని కష్టాల నుండి గట్టెక్కిస్తాయని నమ్మటమే దీనికి కారణం.  దేని మీదా నమ్మకం లేకపోయినా పెద్దవాళ్ళ మనసు నొప్పించగూడదనో, లేకపోతే, ఏమో చేస్తే పోలే అనో అనుకుంటూ ఆచరిస్తుంటారు.
మనిషికున్న అత్యాశే మూఢాచారాలకు తావునిస్తోంది.  మనిషికి ఎంత ఉన్నా తృప్తి అనేది లేక ఇంకా ఎక్కువ, అందరికంటే ఎక్కువ సంపాదించాలనే ఆశకు తన తాహతు, శక్తియుక్తులు సరిపోవని అనిపించినప్పుడు అతీత శక్తుల గురించి ఆలోచిస్తాడు.  అంటే మామూలుగా లభించేదానికి ఎక్కువ రెట్లు సంపాదించాలనే తహతహ మూఢ నమ్మకాలవైపు మొగ్గు చూపించేట్టుగా చేస్తుంది.

మనిషికి తృప్తి కలగటమంటే ఉన్నదానితో సరిపుచ్చుకుని బద్ధకించమని కాదు.  చేసే ప్రయత్నం పూర్తిగా చేసిన తర్వాత కలిగిన ఫలితంతో తృప్తి పడటమే ఆచరించవలసిన విధానం.  దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు, నువ్వు చేసే పని నువు సంపూర్ణంగా చేసి ఫలితాన్ని నాకు వదిలిపెట్టు అని చెప్తాడు.  అయితే వాటిని చదివే వారిలో దాన్ని కూడా పారాయణ గ్రంథంగా చేసుకుని వల్లె వేయటం చేస్తున్నవారే అధికశాతం ఉంటారు.

కర్నాటకలోని ఉమ్మి స్నానం అనబడే ఈ ఆచారాన్ని దళిత సంఘాలు, నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.  అయితే ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారమని, దీన్ని దళిత వ్యతిరేకంగా భావించటం తప్పని అనేవారున్నారు.  బ్రాహ్మణేతరులే కాదు బ్రాహ్మలే ఆ పని చేసినా సరే ఇది విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధమని వాదించేవారూ ఉన్నారు.

భవిష్య వాణి, సంఖ్యా శాస్త్రం లాంటివాటికి ఎక్కువగా మొగ్గు చూపించటానికి అసలు కారణం తేరగా వచ్చే భాగ్యం మీద మోజు.  సంపదలు కలగాలని అనుకోవటంలో తప్పు లేదు.  అందుకు పాటుపడటం అవసరం కూడా.  దాని వలన ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది, శరీరానికీ మనసుకీ వ్యాయామం కలుగుతుంది.  చలనం అనేది జీవికి ముఖ్యం కాబట్టి వ్యాపకం పెట్టుకోవటం అవసరం.  దాని వలన వచ్చే లాభం ఎలాగూ వస్తుంది. అంతకంటే ఎక్కువ రావాలి, అందరినీ మించిపోవాలి అనే పోటీ తత్వం కూడా ప్రగతి దృష్ట్యా మంచిదే.  కానీ అలా వచ్చేదానికి నా కృషి కాకుండా మానవాతీతమైన శక్తులు సహకరించాలనే వ్యామోహమే మనిషిని మూఢనమ్మకాల బారిన పడేస్తున్నాయి.
ఈ మూఢ నమ్మకాలలో ఇతరులను బాధించనంత వరకు సహించవచ్చు.  బయటకు పోయేముందు యాంత్రికంగా బొట్టు పెట్టుకుని అగరుబత్తీలను దేవుడి పటం దగ్గర వెలిగించి పెడతారు- అందులో ఎవరికీ నష్టం లేదు కాబట్టి పరవాలేదు.  కానీ జుగుప్సాకరమైన చేష్టలు, తంతులు, విజ్ఞాన శాస్త్రం పురోగతిలో పోతుంటే మనుషులను తిరోగతిలో శతాబ్దాల వెనక్కి నెట్టేస్తున్నాయి.

కింది వీడియోలో, బ్రాహ్మణులు తిని వదిలేసిన ఆకుల మీద పోటీపడి పొర్లుదండాలు పెడుతున్న వారిని చూడవచ్చు.
Why Superstitions Continue

why superstitions continue, blind beliefs in India, spit bath in Karnataka, sacrifices, human sacrifices, old customs and traditions, Bhagavadgita

No comments:

Post a Comment