Tuesday, 11 February 2014

Medaram Jatara Special

గిరిజన జాతరల్లో అతిపెద్ద జాతర మేడారం...

Untitled-1.gif

అరణ్యగర్భంలోని ఒక గిరిజన కుగ్రామంలో రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతర మహాజాతరై పోటెత్తుతుంది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులు పొందడం కోసం తరలివచ్చే కోట్లాదిమంది భక్తజనంతో ఆ గ్రామం మహానగరంలా భాసిల్లుతుంది. విభిన్నమైన సంస్కృతి, విశిష్టమైన సంప్రదాయాలతో కూడిన అన్ని జాతరల్లోకి మేటైన జాతరగా మేడారం జాతరను అభివర్ణిస్తారు.

పూజా విధానం.... 

మేడారం జాతరలో వనదేవతలకు  పూజారులు జరిపే పూజలు విభిన్నమైనవి. దేవతలను గద్దెలకు తీసుకువచ్చే సమయంలో పూజలు అత్యంత గోప్యంగా నిర్వహిస్తారు. ఈ జాతరలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం జరిగే ప్రతీపూజా విశేషంగా, ఆకర్షణీయంగా వుంటుంది. పసుపు, కుంకుమలు, సాంబ్రాణి దూపం, వెదురుకర్రలతో సహజసిద్దంగా పూజలు జరుగుతాయి.

గుడిమెలిగే పండగ..

ప్రధాన జాతరకు సరిగ్గా 15రోజుల ముందు గుడిమెలిగే పండగతో పూజాకార్యక్రమాలు మొదలవుతాయి. గతంలో పూరిగుడిసెలోనే దేవాలయాలను నిర్మించుకునేవారు. కానీ రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర కోసం ఆ గుడిసెలను తొలగించి, ఆ ప్రదేశాన్ని శుద్ధిచేసేవారు. తర్వాత వారంరోజులకు అడవికి వెళ్లి కర్రలను తీసుకువచ్చి కొత్త గుడిసెలను సిద్దం చేసుకునేవారు. అయితే ఇప్పుడు మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సారలమ్మలకు శాశ్వత దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఇరుచోట్లా ఆయా పూజారులు దేవాలయాలను శుద్ధిచేస్తారు. పూజలో ఉపయోగించే డోలీలు, మువ్వలు, ఇతర సామాగ్రిని శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకుంటారు. ఈ పూజలు అత్యంత నిష్టగా జరుగుతాయి. పూజారులంతా ఉదయంనుంచే దేవాలయాలవద్ద ఈ కార్యక్రమాల్లో తలమునకలవుతారు. మద్యం, మాంసం ముట్టుకోకుండా పవిత్రంగా పూజలో పాల్గొంటారు.

medaram

మండమెలిగే పండగ..

జాతరకు ఇంకా వారంరోజుల గడువుండగా మండమెలిగే పండగను నిర్వహిస్తారు. ఆదివాసులుఎంతో పవిత్రంగా భావించే వెదురును వనం నుంచి తెచ్చి దేవాలయాలు, గద్దెలపై ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. డోలువాయిద్యాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో వెదురును అడవి నుంచి గద్దెలకు తీసుకువస్తారు. ఇదేరోజున ఊరి పొలిమేరలో ఎత్తైన కర్రస్థంభాలను ఏర్పాటుచేసి మామిడి తోరణాలు కడతారు. గ్రామానికి నలుదిక్కులా రక్ష కట్టి యాటపోతులను బలిస్తారు.

ప్రధానఘట్టం రహస్యం..

సమ్మక్క, సారలమ్మలను గద్దెలకు తీసుకువచ్చే ప్రధానఘట్టంలో జరిగే పూజలు రహస్యం. చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణెను గద్దెకు చేర్చేక్రమంలో అక్కడి నెమలినారచెట్టు వద్ద రహస్యపూజలు జరుగుపుతారు. ప్రధాన పూజారి జలకపు వడ్డె, దూపపు వడ్డెతోపాటు మిగతా పూజారులు మాత్రమే పాల్గొంటారు. తల్లిని ప్రసన్నం చేసుకున్న తర్వాత అక్కడనుంచి పరుగులాంటి నడకతో గద్దెలకు బయలుదేరుతారు.

ఆ క్షణంలో భక్తుల్లో వ్యక్తమయ్యే భావోద్వేగాలు అనిర్వచనీయం. ఎక్కడికక్కడ దేవతను మదిలో తలుచుకొని మేకలు, కోళ్లను బలిస్తారు. కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయంలో కూడా పూజలు గోప్యంగా జరుగుతాయి. ప్రధాన పూజారి పూజలు జరిపే సమయంలో అమ్మవారు ఆయనపై పూనుతుంది. వెంటనే దేవతా ప్రతిమను చేతిలోకి తీసుకొని అక్కడినుంచి మేడారం బయలుదేరుతారు. ప్రధాన పూజారిపై దేవత పూనేవరకు దూపపు వడ్డె, జలకపు వడ్డెలు తమ పూజలను కొనసాగిస్తారు.

హరిద్వార్ కుంభమేళ తర్వాత దేశంలోనే అతిగొప్ప జాతరాగా మేడారం పేరుపొందింది. వరంగల్ జిల్లా కేంద్రానికి సుమారు 105 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతం మధ్యన ఉంటుందా ఊరు. ప్రతీ రెండేళ్ల కోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు జరిగే మహాజాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది జనం తరలివస్తారు. ఈసారి జాతర ఈ నెల 12 నుంచి 15వరకు జరగనుంది. కాని ఇప్పటికే గత నెలరోజులుగా మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. రద్దీని దృష్టిలో పెట్టుకొని వేలాది మంది భక్తులు ముందస్తు వచ్చి మొక్కులు సమర్పిస్తున్నారు. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. గత ఆరునెలలుగా అన్ని ప్రభుత్వ శాఖల వారు పనుల్లో నిమగ్నమై ఏర్పాట్లను పూర్తిచేశారు.

medaram1

ఇంటి ఆడబిడ్డలకు  ఒడివాల  బియ్యం...
మేడారంలో పూజా విధానం గిరిజనుల ఆచార, సంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. ఇది ఆద్యంతం భిన్నంగా వుంటుంది. ఇక్కడ విగ్రహాలుకానీ, గుళ్లుకానీ వుండవు. బహిరంగ ప్రదేశంలో వృత్తాకారంలో నిర్మించిన గద్దెలపైన చీరలతో చుట్టిన కర్రలు వుంటాయి. ఒక గద్దెపైన సమ్మక్క, మరో గద్దెపైన సారలమ్మ వుంటారని భక్తుల విశ్వాసం. జాతర సమయంలో గిరిజన పూజారులు చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను, కన్నెపల్లి నుంచి సారలమ్మను కుంకుమ భరిణె రూపంలో తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. అప్పుడే దేవతలు కొలువుదీరినట్టుగా భావిస్తారు. లక్షలాది మంది భక్తులు గద్దెల వద్దకువచ్చి తల్లులను దర్శించుకుంటారు. వెంట తెచ్చిన బెల్లం(బంగారం)ను సమర్పిస్తారు. గద్దెలపైన వున్న కొబ్బరి కుడుకలు, బెల్లం ముక్కలను స్వీకరించి మహాప్రసాదంగా కళ్లకు అద్దుకుంటారు. దర్శనం పూర్తయిన వెంటనే మందూ, మాంసంతో విందు చేసుకుంటారు. ప్రకృతితో మమేకమై ఆనందంగా గడుపుతారు. బస కోసం ఎలాంటి ఏర్పాట్లు లేకపోయినా లక్షలాది మంది మేడారం పరిసర ప్రాంతాల్లోని అడవిలో తాత్కాలిక డేరాలు ఏర్పాటు చేసుకుంటారు. ఒకప్పుడు గిరిజనులకే పరిమితమైన జాతర, కాల క్రమేణా అన్ని వర్గాల ప్రజలకు వేదికగా మారింది.



సమ్మక్క సారలమ్మ తల్లులకు బెల్లం నైవేద్యమే బంగారం. కోరిన కోర్కెలు తీర్చే తల్లులకు ఎత్తుబంగారాన్ని తులాభారం వేసి సమర్పిస్తారు భక్తులు. సమ్మక్క, సారలమ్మలను భక్తులు తమ ఇంటి ఆడబిడ్డలుగా భావిస్తారు. అందుకే జాతర సందర్భంగా తల్లులకు ఒడివాల బియ్యంతో సారెపోస్తారు. జాతరకు వెళ్లే ప్రతీ కుటుంబం తీరని కోర్కెలను విన్నవిస్తూ, తీరిన కోర్కెలకు ప్రతిఫలంగా యాటపోతులు,కోళ్లను బలిస్తారు. బలిచ్చిన వాటిని ఇంటిల్లిపాది తల్లి ప్రసాదంగా భావిస్తూ ఆరగిస్తారు. బంధువులు, మిత్రులను ఆహ్వానించి జాతర పరిసరాల్లో వేడుక చేసుకుంటారు.

medaram2

వరం పట్టించుకోవాలని...

శివసత్తుల పూనకాలు, జంపన్నవాగులో పట్టే వరాలు భక్తితత్వాన్ని రెట్టింపు చేస్తాయి. తల్లులను కీర్తిస్తూ వారి నోటివెంట ప్రవహించే మాటలు అబ్బురపరుస్తాయి. మేడారం గాలి సోకగానే, జంపన్నవాగు నీటిస్పర్శ తాకగానే వారిలో భక్తితత్వం ఉప్పొంగుతుంది. వారితో వరం పట్టించుకోవాలని భక్తులు ఆరాటపడతారు. కడుపుపండాలని, దీర్ఘకాలిక వ్యాధులు నయం కావాలని, కుటుంబంలో కరువైన సుఖసంతోషాలు తిరిగి రావాలని భక్తులు శివసత్తులచేత వరం పట్టించుకొని సాక్షాత్తు తల్లులే ఆశీర్వదించినట్లు సంతృప్తిపడతారు. జాతరను 1996లో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించింది.

అప్పటి నుంచి ప్రతీ జాతరకు మెరుగైన ఏర్పాట్లు చోటుచేసుకుంటున్నాయి. జాతర జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో రహదారులను విస్తరించారు. రాకపోకల కోసం వేలాది ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వేలాదిమంది పోలీసులను నియమించారు. పర్యావరణం దెబ్బతినకుండా ప్లాస్టిక్‌ను నిషేధించారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా మరుగుదొడ్లు నిర్మించారు. మంచినీటి సౌకర్యం కోసం బోర్లను ఏర్పాటుచేశారు. ప్రతీ జాతరకు ముఖ్యమంత్రితో పాటు, ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు,ఉన్నతాధికారులు రావడం ఆనవాయితీగా వస్తోంది. జాతర వేళ నాలుగు రోజుల పాటు జనవనంగా మారే మేడారం.. ఆ తర్వాత పచ్చనిపల్లెగా అడవి తల్లి ఒడిలో ఒదిగిపోతుంది.

Medaram Jatara Special

Medaram Samakka sarakka jatara, Medaram Jatara, Medaram jarara in warangal dist, Samakka sarakka jatara, Medaram Jatara Special

No comments:

Post a Comment